అదే ఈ శివలింగం వెనుక కథ
ప్రాచీనమైన శైవ క్షేత్రాలను దర్శించినప్పుడు అక్కడి విశేషాలు ఆనందాశ్చర్యాలను కలిగిస్తుంటాయి. ఒక శివలింగం పాదభాగం నుంచి నీరు ఉబికి వస్తూ ఉంటే, మరో శివలింగం శిరస్సు భాగంలో నుంచి నీరు ఊరుతూ ఉంటుంది. ఒక శివలింగంపై పావురం గుర్తు ఉంటే, వేరొక శివలింగంపై జడల గుర్తులు కనిపిస్తుంటాయి. ఇలా ఒక్కో శివలింగం ఒక్కో ప్రత్యేకతను కలిగి దర్శనమిస్తుంటాయి.
ఆదిలాబాద్ జిల్లాలోని 'సిరిచెల్మ'లో మాత్రం, శివలింగం పైభాగం లోపలికి నొక్కినట్టుగా కాస్త చొట్టతో దర్శనమిస్తుంది. పరమశివుడు బాలుడి రూపంలో చెరువు తవ్వి ఆ మట్టి తట్టలను మోశాడనీ, ఆ బరువు కారణంగానే ఆయన శివలింగంగా మారిన తరువాత శిరస్సు భాగంలో అదిమి పెట్టినట్టుగా కనిపిస్తుందని చెప్పుకుంటూ వుంటారు.
చాలాకాలం క్రితం ఈ ప్రాంతంలో కరవు కారకాలు ఏర్పడినప్పుడు, ఈ ఊరుకి ఒక బాలుడు వచ్చాడట. దివ్యమైన తేజస్సు కలిగిన ఆ బాలుడు ఒక్క రాత్రిలోనే చెరువు తవ్వి, ఆ ప్రదేశంలో శివలింగంగా మారిపోయాడట. అలా ఇక్కడ శివుడు ప్రత్యక్షంగా వున్నాడని స్థానికులు బలంగా నమ్ముతుంటారు. ఈ స్వామిని పూజించడం వలన సమస్త దోషాలు తొలగిపోయి, సకల శుభాలు చేకూరుతాయని భావిస్తుంటారు.