వరాలనిచ్చే చెన్నకేశవుడు
భక్తులను ఆదుకోవడానికి శ్రీమహావిష్ణువు .. చెన్నకేశవస్వామిగా అనేక ప్రదేశాల్లో కొలువుదీరాడు. పూర్వం రాజులు యుద్ధాలకి బయలుదేరేముందు ఈ స్వామిని పూజించేవారు. ఆయన అనుగ్రహం వలన విజయం లభిస్తుందని విశ్వసించేవారు. ఆ స్వామి దర్శనం చేతనే మనసులోని ధర్మ బద్ధమైన కోరికలు నెరవేరతాయని భక్తులు నమ్ముతుంటారు.
అలా ఆ స్వామి కొలువుదీరిన ప్రాచీన క్షేత్రాల్లో కర్నూలు జిల్లా 'కప్పట్రాళ్ల' ఒకటిగా కనిపిస్తుంది. ఇక్కడి కొండపై స్వామి పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. 'సర్పయాగం' చేసిన జనమేజయ మహారాజు .. ఆ పాపానికి పరిహారం చేసుకోవడం ఎలాగో సెలవీయమని కౌండిన్య మహర్షిని కోరాడట. ఆయన ఒక ముడి శిలను చూపించి .. చెన్నకేశవస్వామి విగ్రహంగా మలిచి ప్రతిష్ఠించమని సెలవిచ్చాడట.
ఆ మహర్షి సూచన మేరకు ఈ విగ్రహాన్ని ఈ ప్రదేశంలో ప్రతిష్ఠించాడని స్థల పురాణం చెబుతోంది. ఆ తరువాత కాలంలో మరుగునపడిన స్వామి మూర్తి .. ఒక పశువుల కాపరి కారణంగా వెలుగులోకి వచ్చిందని అంటారు. ఈ స్వామిని పూజించడం వలన ఆపదలు .. ఆటంకాలు తొలగిపోయి, విజయాలు లభిస్తాయని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. కోరిన వరాల నిచ్చే స్వామిని అనునిత్యం ఆరాధిస్తూ తరిస్తుంటారు.