చల్లగా చూసే తలుపులమ్మ తల్లి
అమ్మవారు అనేక రూపాలతో కొలువై .. అనేక నామాలతో పిలవబడుతూ పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటుంది. అలాంటి అమ్మవారు తలుపులమ్మ పేరుతో పూజలు అందుకనే క్షేత్రం తూర్పు గోదావరి జిల్లా 'తుని' సమీపంలోని 'లోవ'లో కనిపిస్తుంది. అగస్త్య మహర్షికి ప్రత్యక్షమైన అమ్మవారు, ఆయన అభ్యర్థన మేరకు ఇక్కడ వెలిసిందని స్థల పురాణం చెబుతోంది.
లలితాంబికాదేవి మరో రూపమే 'తలుపులమ్మ తల్లి'గా భక్తులు విశ్వసిస్తుంటారు. ఈ తల్లిని ఆరాధిస్తే ఆయురారోగ్యాలు ప్రసాదిస్తుందని అనుభవపూర్వకంగా చెబుతుంటారు. ఇక ఇక్కడి మరో విశేషం ఏమిటంటే వాహన ప్రమాదాల నుంచి అమ్మవారు రక్షిస్తుందని నమ్ముతుంటారు. అందువలన చుట్టుపక్కల ప్రాంతాల వారు కొత్త వాహనాన్ని కొనుగోలు చేయగానే, ఇక్కడికి వచ్చి పూజ చేయిస్తారు.
అంతే కాకుండా ఇక్కడి రాళ్లపై తమ వాహనాల నెంబర్ రాస్తుంటారు. ఇలా చేయడం వలన అమ్మవారు తమ వాహనానికి ఎలాంటి ప్రమాదం జరక్కుండా కాపాడుతూ ఉంటుందని చెబుతుంటారు. ఈ ప్రాంతంలో వాహనాలపై అమ్మవారి పేరు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆ తల్లి పట్ల భక్తులకి గల విశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తుంటుంది.