కరుణించే సాయినాథుడు
భక్తులు తన పట్ల విశ్వాసం ఉంచితే చాలనీ .. సమాధి నుంచే తన అనుగ్రహం లభిస్తుందని శిరిడీ సాయిబాబా చెప్పారు. నిజ జీవితంలో ఆయన ఎప్పుడు మహిమలు చూపి ఆకట్టుకోవాలని అనుకోలేదు. తాను గురువునని చెప్పి ఆకర్షించడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ప్రేమతోనే ఆయన భక్తుల మనసులను గెలుచుకున్నారు .. అపారమైన కరుణ చూపిస్తూ అందరికీ దగ్గరయ్యారు.
అలాంటి శిరిడీ సాయిబాబా భక్తుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. అందుకు కారణం ఆయన మహిమలు భక్తుల అనుభవాల్లోకి రావడమే. అందువల్లనే అంతా ఆయన ఆలయాలు తమ గ్రామాల్లోను వుండాలని, నిర్మించుకుంటున్నారు. అలా భక్తుల సంకల్పం చేత ఏర్పడిన ఆలయాలలో ఒకటి కర్నూల్ జిల్లా 'పత్తికొండ'లో కనిపిస్తుంది.
సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. శిరిడీ మాదిరిగానే ఇక్కడ అభిషేకాలు .. ప్రత్యేక పూజలు .. సేవలను నిర్వహిస్తుంటారు. ఇక్కడ సాయిని దర్శించడం వలన ఆపదలు .. అనారోగ్యాలు .. ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ఎలాంటి కష్టం చెప్పుకున్నా ఆయన వెంటనే కరుణిస్తాడని అనుభవపూర్వకంగా చెప్పుకుంటూ వుంటారు.