కొండ్రపోలు హనుమంతుడు
హనుమంతుడిని పూజించడం వలన సమస్త దేవతలను పూజించిన ఫలితం కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఆ స్వామి అనుగ్రహం కారణంగా అనారోగ్యాలు .. గ్రహ బాధలు .. దుష్ట శక్తుల పీడలు తొలగిపోతాయని స్పష్టం చేస్తున్నాయి. అందువలన హనుమంతుడిని పూజించే భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. భక్తజన సందోహంతో ఆయన ఆలయాలు సందడిగా కనిపిస్తుంటాయి.
అలాంటి హనుమంతుడి ఆలయాలలో ఒకటి 'కొండ్రపోలు'లో దర్శనమిస్తుంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం పరిధిలో ఈ క్షేత్రం అలరారుతోంది. మిర్యాలగూడ నుంచి 'వాడపల్లి' వెళ్లే దారిలో రహదారికి కాస్త దూరంలో గుట్టపై ఈ క్షేత్రం కనిపిస్తూ ఉంటుంది. ఇటు నుంచి వెళ్లే ప్రయాణికులు .. అటు నుంచి వచ్చే ప్రయాణికులు ఈ క్షేత్రాన్ని ఎక్కువగా దర్శించుకుంటూ వుంటారు. మంగళ .. శని .. ఆది వారాల్లో స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ప్రశాంతమైన ప్రదేశంలో కొలువైన హనుమంతుడిని దర్శించగానే మానసికపరమైన ఉల్లాసం కలుగుతుంది. ఇక్కడి స్వామివారిని దర్శించుకోవడం వలన, సకల శుభాలు చేకూరుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.