ఆపదలో ఆదుకునే భగవంతుడు

భగవంతుడు తనని నమ్మిన వాళ్లని కంటికి రెప్పలా కాపాడుతుంటాడు. ఆపదలో .. అవసరాల్లో వున్న తన భక్తులను అనుక్షణం రక్షిస్తూనే ఉంటాడు. మహాభక్తుల జీవితంలో జరిగిన కొన్ని సంఘనలను చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఒకసారి పురందరదాసు తాను భిక్షమెత్తిన సరుకులతో పేదలకి అన్నదానం చేస్తుంటాడు. ఆ సమయంలో నెయ్యిని వడ్డించలేకపోతున్నందుకు ఆయన బాధపడుతుంటే, ఆయన శిష్యుడు రూపంలో భగవంతుడు వచ్చి నెయ్యిని వడ్డన చేశాడు.

జ్ఞానదేవుడు .. నామదేవులని అతిథులుగా ఆహ్వానించిన 'గోరా' .. ఇంట్లో సరుకులు నిండుకోవడంతో ఆవేదన చెందుతాడు. అప్పుడు బంధువు రూపంలో భగవంతుడు వచ్చి, సరుకులను అందజేస్తాడు. ఒకసారి శ్రీరాముడి ఉత్సవాల కోసమని ఒక వ్యాపారస్తుడు త్యాగయ్యకి తెలియకుండా ఆయన పల్లకిలో కొంత ధనం ఉంచుతాడు.

అక్కడి నుంచి త్యాగయ్య తిరిగి వస్తుండగా, దొంగల గుంపు అడ్డుకుంటుంది. ఆ సమయంలో రామలక్ష్మణులు వచ్చి ఆయనని రక్షిస్తారు. ఇక రామదాసు నవాబు చెరలో వున్నప్పుడు, ఆయన ఆవేదనని అర్థం చేసుకుని లక్ష్మణుడితో సహా వచ్చి రాముడు విముక్తిని కల్పిస్తాడు. ఇలా భక్తులను భగవంతుడు రక్షిస్తాడనటానికి ఎన్నో నిదర్శనాలు వున్నాయి.


More Bhakti News