రామ నామ స్మరణ చాలు
ఏ ఊరులో చూసినా రామాలయం ఉంటుంది .. ఏ ఇంట్లో చూసినా రాముడి చిత్రపటం ఉంటుంది. అంతగా శ్రీరాముడు జనులకు దగ్గరయ్యాడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే లోక కల్యాణం కోసం శ్రీరామచంద్రుడిగా అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి.
ధర్మాన్ని ఆచరించమనీ .. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధర్మ మార్గాన్ని అనుసరించమని లోకానికి చాటి చెప్పడం కోసం మానవుడిగా జన్మించి అనేక కష్టాలను అనుభవించిన పుణ్యపురుషుడు శ్రీరామచంద్రుడు. అలాంటి శ్రీరాముడి నామానికి అనంతమైన శక్తి ఉందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. శ్రీమహావిష్ణువు వేయి నామాలతో సమానమైనది రామ నామమేనని స్పష్టం చేస్తున్నాయి.
రామ నామాన్ని స్మరించడం వలన కష్టాలు .. కన్నీళ్లు .. ఆపదలు .. అనారోగ్యాలు దూరమవుతాయి. అనేక పాపాలు ఆ క్షణమే నశించి, పుణ్య ఫలాలు చేకూరతాయి. దివ్య క్షేత్రాలను .. పుణ్యతీర్థాలను దర్శించిన ఫలితం దక్కుతుంది. రామ నామానికి మించిన కామధేనువు లేదనే విషయాన్ని ఎంతోమంది భక్తులు చాటి చెప్పారు. మోక్షాన్ని కోరుకునేవారికి రామ నామానికి మించిన సాధనం లేదని స్పష్టం చేశారు.