అగస్త్యేశ్వర స్వామి దర్శన ఫలితం
అగస్త్య మహర్షి అనేక ప్రాంతాలలో పర్యటిస్తూ .. శివలింగాలను ప్రతిష్ఠిస్తూ వెళ్లారు. అలా ఆయనచే ప్రతిష్ఠించబడిన స్వామివారు అగస్త్యేశ్వర స్వామిగా పిలవబడుతూ .. కొలవబడుతున్నాడు. అలా అగస్త్య మహర్షి కారణంగా సదాశివుడు ఆవిర్భవించిన క్షేత్రాలలో 'తొండవాడ' ఒకటిగా కనిపిస్తుంది. చిత్తూరు జిల్లా పరిధిలో గోదావరి నదీ తీరంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది.
అగస్త్య మహర్షి ఇక్కడి నదిలో స్నానం చేస్తూ ఉండగా, ఆయనకి శిగవలింగం లభించింది. అది ఆది దేవుడి లీలా విశేషంగా భావించిన ఆయన, ఈ ప్రదేశంలో ప్రతిష్ఠించి, పరమ శివుడిని గురించి తపస్సు చేశాడట. ఆయన తపస్సుకి మెచ్చి శివుడు ప్రత్యక్షమై, తన పాదుకలను ప్రసాదించాడని స్థల పురాణం చెబుతోంది. అలా శివుడు ప్రత్యక్షమైన ప్రదేశంలో ఆయన 'పాద ముద్రలు' నేటికీ కనిపిస్తుంటాయి. ఇక్కడి అమ్మవారు ఆనందవల్లి పేరుతో దర్శనమిస్తూ ఉంటుంది. ఇక్కడి స్వామివారికి పూజాభిషేకాలు నిర్వహించడం వలన, సమస్త దోషాలు తొలగిపోయి, విశేషమైన పుణ్య ఫలాలు లభిస్తాయని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు.