అన్నపూర్ణమ్మ అనుగ్రహం వుంటే చాలు
భక్తులను అనుగ్రహించడం కోసం అమ్మవారు అనేక రూపాలను ధరించింది. అలా ఆ తల్లి అన్నపూర్ణమ్మగా భక్తులను అనుగ్రహిస్తోంది. ఆహారం కోసమే మానవులు అనేక కష్టాలను అనుభవిస్తుంటారు. నిస్సహాయులు ఆహారం కోసం అలమటించి పోతుంటారు. ఎంత కలిగిన వాళ్లైనా ఒక్కోసారి ఆకలిని తీర్చుకోలేని పరిస్థితులు ఎదురవుతుంటాయి. అలాంటి పరిస్థితుల్లో అన్నపూర్ణమ్మను తలచుకుంటే, ఆ తల్లి వారి ఆకలిని తప్పకుండా తీరుస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
వనవాస కాలంలో సీతారాములు ఆకలి బాధను అనుభవించవలసి వస్తుందని భావించిన అగస్త్య మహర్షి, అలాంటి పరిస్థితి ఎదురైన సమయాన అన్నపూర్ణమ్మను ధ్యానించమని చెబుతాడు. అలాగే పాండవులు అరణ్యవాస సమయంలో, ఆహారం లభించక తాముపడుతోన్న అవస్థలను గురించి శ్రీకృష్ణుడి దగ్గర ప్రస్తావిస్తారు. అన్నపూర్ణమ్మను భక్తి శ్రద్ధలతో ధ్యానించమనీ, ఆకలి తీరే మార్గాన్ని ఆమె సూచిస్తుందని శ్రీకృష్ణుడు సెలవిస్తాడు. అందువలన ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆకలి బాధను అనుభవించకుండా ఉండటం కోసం, సదా అన్నపూర్ణమ్మ తల్లిని పూజిస్తూ .. స్మరిస్తూ ఉండాలి.