భగవంతుడు ఆశించేది భక్తి శ్రద్ధలే
అనంతమైన ఈ విశ్వంలో ఎన్నో దివ్య క్షేత్రాలు .. మరెన్నో పుణ్యతీర్థాలు వున్నాయి. ఆయా క్షేత్రాలలో కొలువైన దైవాన్ని దర్శించుకోవాలని చాలామంది భక్తులు ఆసక్తిని చూపుతుంటారు. ఏ మాత్రం కాస్త తీరిక దొరికినా కుటుంబ సభ్యులతో కలిసి, ఆయా క్షేత్రాలను దర్శించుకుని వస్తుంటారు. అయితే ఏ క్షేత్రానికైనా హడావిడిగా వెళ్లి రాకూడదు. వెళ్లాలనుకున్న క్షేత్ర విశేషాలను ముందుగా తెలుసుకోవాలి. అప్పుడే ఆ క్షేత్ర మహాత్మ్యం గురించిన పూర్తి విశేషాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం లభిస్తుంది.
మరికొంతమంది క్షేత్ర దర్శనం చేసుకుని వెళ్లాక, ఇక ఆ క్షేత్రాన్ని గురించి మరిచిపోతుంటారు. అలా కాకుండా ఆ క్షేత్రంలో కొలువైన దైవం రూపాన్ని మనసులో ప్రతిష్ఠించుకోవాలి. ఆ క్షేత్ర వైభవాన్ని తలచుకుంటూ వుండాలి. అక్కడి భగవంతుడికి మనసులోనే నమస్కారం చేసుకుంటూ ఉండాలి. ఒక క్షేత్రానికి ఎన్ని మార్లు వెళ్లామనేదానికన్నా, అక్కడి భగవంతుడి రూపాన్ని మనసులో ఎంత గాఢంగా ముద్రించుకున్నామనేదే ప్రధానం. ఆ దైవం పట్ల ఎంతటి భక్తి శ్రద్ధలను కలిగి వున్నామనేదే ముఖ్యం. ఎందుకంటే ఎవరి నుంచైనా భగవంతుడు ఆశించేది భక్తి శ్రద్ధలే.