వాడపల్లి క్షేత్ర దర్శనమే మహా భాగ్యం

నల్గొండ జిల్లాలో కొలువైన ప్రాచీన శివకేశవ క్షేత్రాల్లో 'వాడపల్లి' ఒకటి. మిర్యాలగూడ మండలంలో ఈ క్షేత్రం అలరారుతోంది. ఇక్కడి శివుడిని .. లక్ష్మీనరసింహస్వామి మూర్తులను 6000 సంవత్సరాల క్రితం అగస్త్య మహర్షి ప్రతిష్ఠించినట్టుగా స్థల పురాణం చెబుతోంది. 12వ శతాబ్దంలో ఆలయ పునఃనిర్మాణం జరిగినట్టుగా చరిత్ర చెబుతోంది.

ఒక వైపున మూసీ నదీ .. మరో వైపున కృష్ణా నది ప్రవహిస్తూ ఉండగా, మధ్యలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. మూసీ నది ఒడ్డున లక్ష్మీ నరసింహస్వామి ఆలయం .. కృష్ణా నది ఒడ్డున శివాలయం దర్శనమిస్తూ ఉంటాయి. ఈ రెండు నదుల సంగమ క్షేత్రం కావడం వలన, పుష్కర స్నానం కోసం భక్తులు వేల సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు.

ఇక్కడి లక్ష్మీ నరసింహస్వామి శ్వాస తీసుకుంటున్నట్టుగా ఆయన నాసిక ఎదురుగా వున్న దీపం రెపరెపలాడుతూ ఉంటుంది. ఆ దీపానికి కాస్త కిందగా వున్న మరో దీపం నిశ్చలంగా ఉంటుంది. ఇక శివలింగం తల భాగంలో నుంచి దివ్యజలం ఊరుతూ వుంటుంది. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తున్నది ఇప్పటికీ ఎవరికి అంతుచిక్కలేదు. అంతటి మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని ఈ పుష్కర కాలంలో దర్శించడం ఓ మహా భాగ్యంగానే చెప్పుకోవాలి.


More Bhakti News