ధనధాన్యాలు ప్రసాదించే దానేశ్వరి
శక్తిస్వరూపిణి అయిన అమ్మవారు అనేక నామాలతో పిలవబడుతూ .. అనేక రూపాల్లో కొలవబడుతూ వుంటుంది. అలా అమ్మవారు 'దానేశ్వరి'గా పిలవబడుతోన్న క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా 'దువ్వ'లో కనిపిస్తుంది. ఇక్కడి ఆలయ ప్రాకారాలపై అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తూ ఉంటుంది. సువిశాలమైన ఆలయ ప్రాంగణంలో పుష్కరిణి కనిపిస్తుంది.
గర్భాలయంలో అమ్మవారి మూర్తి చాలా చిన్నదిగా దర్శనమిస్తూ ఉంటుంది. అమ్మవారి మహిమలు అపారమని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. చాలాకాలం క్రితం అమ్మవారు ఇక్కడ 'ధాన్యేశ్వరి'గా పూజలు అందుకునేదట. అమ్మవారిని పూజించడం వలన ధన ధాన్యాలకు లోటు ఉండదని భక్తులు విశ్వసిస్తుంటారు. కాలక్రమంలో అమ్మవారు 'దానేశ్వరి'గా పిలబడుతోంది. ఇప్పటికీ అమ్మవారిని 'వనదేవత'గానే ఆరాధిస్తుంటారు. వానలు కురిసేది .. పంటలు బాగా పండేది .. సంపదలు వృద్ధి చెందేది ఈ అమ్మవారి అనుగ్రహం వల్లనే అని భక్తులు విశ్వసిస్తుంటారు.