భక్తులను పరీక్షించే భగవంతుడు
భగవంతుడు తన భక్తులను పరీక్షించి, వాళ్లలోని భక్తి ఏ స్థాయిలో వుందో తెలుసుకుని మరీ అనుగ్రహిస్తుంటాడు. ముఖ్యంగా తన భక్తులలో మంచితనం .. మానవత్వం .. దానగుణం .. ఇతరుల పట్ల ఆత్మీయతా భావం ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకుని ప్రీతి చెందుతాడు.
అలా ఒకసారి పురందరదాసులోని దాన గుణాన్ని తెలుసుకోవడానికి భగవంతుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి దానం అడుగుతాడు. అప్పటికి ఇంకా లోభిగా వున్న పురందరదాసు, దానం ఇవ్వకుండా అనేక మార్లు తిప్పుతాడు. ఆ తరువాత ఆయన తన లోభితనాన్ని గురించి .. భగవంతుడు పెట్టిన పరీక్ష గురించి తెలుసుకుని పశ్చాత్తాప పడతాడు. భగవంతుడి అనుగ్రహానికి మించిన సంపద లేదని భావించి, తన దగ్గరున్న ధనరాశిని పేదలకి పంచివేస్తాడు.
ఇక తుకారామ్ చెంతకి కూడా ఆ భగవంతుడు ఒక బాలుడు రూపంలో వచ్చి ఏదైనా వుంటే పెట్టమని అడుగుతాడు. తుకారాం ఎంత మాత్రం ఆలోచించకుండా తన ఇంట్లో వున్న కొంచెం గోధుమపిండిని దానం చేసేస్తాడు. అలా దానం చేసి లోపలికి వచ్చిన ఆయనకి .. అంతకి వందరెట్ల పిండి ఇంట్లో ఉండటం చూసి ఆనందాశ్చర్యాలకి లోనవుతాడు. ఇలా భగవంతుడు భక్తులను పరీక్షిస్తూ .. తన లీలా విశేషాలను చూపుతుంటాడు.