కోరికలే అశాంతికి కారణం

కోరికలు మనసే కేంద్రంగా పుట్టుకొస్తుంటాయి .. మనిషిని పరుగులు తీయిస్తుంటాయి. ఒక కోరిక తీరిన తరువాత మనసు మరో కోరికను రేకెత్తిస్తూనే ఉంటుంది. కోరిక నెరవేరితే ఆనందం .. లేదంటే విచారం కలుగుతుంటాయి. తన మనసులో పుట్టే కోరికలను నెరవేర్చుకోవడానికి మనిషి నిరంతరం ఆరాటపడుతూనే ఉంటాడు. ఆశాభంగం కలిగినప్పుడు అశాంతికి లోనవుతుంటాడు.

గద్ద చేపపిల్లను నోట కరుచుకుని వెళుతూవుంటే, ఆ చేప కోసం కాకుల గుంపు దానిని వెంటాడుతుంది. గద్ద నోట కరచుకున్న చేపపిల్లను వదిలేస్తే, ఆ కాకులు దానిని తరమడం మానేస్తాయి. దాంతో ఆ గద్ద ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మనసులో కోరికతో మనిషి పరిగెడుతూ ఉన్నంత కాలం అశాంతి వెంటాడుతూనే ఉంటుంది. కోరికలను వదిలేసినప్పుడు అశాంతి దూరమైపోతుంది .. ప్రశాంతత లభిస్తుందని రామకృష్ణ పరమహంస చెప్పారు. అందుకే కోరికలను నియంత్రిస్తూ మనిషి తన మనుగడను కొనసాగించాలి. ప్రశాంతత .. ఏకాగ్రతకి కారణమవుతుంది .. ఏకాగ్రత ధ్యానం వైపుకి తీసుకెళుతుంది. ధ్యానం .. భగవంతుడి సమీపానికి తీసుకెళుతుంది.


More Bhakti News