ఆధ్యాత్మిక మార్గంలోనే ఆనందం వుంది
భగవంతుడే సర్వానికి యజమాని అనే భావ కలిగినప్పుడు .. ఆ భగవంతుడి సృష్టిలోని వాళ్లంతా బంధువులుగానే కనపడతారు. అంతా దగ్గర బంధువులుగా అనిపించినప్పుడు స్వార్థం .. ద్వేషం నశించి, మనసు మరింత నిర్మలమవుతుంది. నిర్మలమైన మనసుతో భగవంతుడిని కీర్తించడంలో కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. అలాంటి ఆనందానుభూతులను పొందిన మహా భక్తులుగా పోతన .. అన్నమయ్య .. పురందరదాసు .. రామదాసు .. త్యాగయ్య .. క్షేత్రయ్య .. తుకారాం .. జ్ఞానదేవుడు .. నామదేవుడు .. మీరాబాయి .. మొల్ల తదితరులు కనిపిస్తారు.
వీళ్లంతా కూడా ఆధ్యాత్మిక మార్గాన్ని సుసంపన్నం చేశారు. భగవంతుడి ఆరాధనలోనే అసలైన ఆనందం ఉందనీ, ఆ ఆనందం ముందు సమస్త సంపదలు ఇచ్చే సౌఖ్యాలు ఎందుకూ పనికి రావని భావించారు. నిరాడంభరమైన జీవితాన్ని ఆశ్రయించి, తమ జీవితాన్ని భగవంతుడి సేవకి అంకితం చేశారు. అందుకే వారి జీవితాలు చరితార్థమయ్యాయి .. ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టినవారికి ఆదర్శప్రాయమయ్యాయి.