భగవంతుడిపై విశ్వాసం ఉంటేచాలు
జీవితంలో కష్టాలు .. ఆపదలు ఎదురవుతూనే ఉంటాయి. అలాంటి సమయంలో ఎవరైనా సరే కంగారు పడటం .. బాధపడటం జరుగుతూ ఉంటుంది. కష్టాన్ని ఎవరికైనా చెప్పుకోవాలనిపిస్తుంది. ఆపద సమయంలో ఎవరైనా అండగా నిలిస్తే బాగుండనిపిస్తుంది.
ఇక కష్టాల్లోనైనా .. నష్టాల్లోనైన అంతా ఆ భగవంతుడిని తలచుకుంటూనే వుంటారు. వాటి బారి నుంచి బయటపడితే ఫలాన మొక్కులు చెల్లిస్తామని మొక్కుకుంటూ వుంటారు. ఈ విశ్వాసమే భగవంతుడిపై వుండాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. భగవంతుడు వున్నాడు .. ఆయన బిడ్డలమైన మనలను ఆయన తప్పకుండా రక్షించుకుంటాడు అనే నమ్మకం ఉండాలి. తల్లి ఒడిలో బిడ్డ ఎంత భద్రతా భావంతో ఉంటుందో, అదే విధంగా ఆయన నీడలో మనం సురక్షితంగా ఉంటామని భావించాలి.
మనకి ఎదురవుతోన్న పరిస్థితులు భగవంతుడు గమనిస్తూనే ఉంటాడు. అవరం అనుకున్నప్పుడు ఆయన సాయం తప్పకుండా అందుతుందనే బలమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఇలా భగవంతుడిపై పూర్తి విశ్వాసం ఉంచినప్పుడు ఆపదలు ఎదురైనా భయపడిపోవడం జరగదు .. ఆందోళన చెందడం జరగదు. అందువలన భగవంతుడిని మనసులో సుస్థిరం చేసుకోవాలి .. అన్నింటికీ ఆయన ఉన్నాడనే బలమైన సంకల్పంతో జీవితాన్ని కొనసాగించాలి.