భగవంతుడు అలా ప్రీతి చెందుతాడు
భగవంతుడి అనుగ్రహంతోనే ప్రతి జీవి తన మనుగడను కొనసాగిస్తూ ఉంటుంది. అయితే ఆ జీవులలో మానవులకి మాత్రమే దైవాన్ని పూజించే .. కీర్తించే భాగ్యం దక్కింది. చాలామంది దైవాన్ని అనునిత్యం ఆరాధిస్తుంటారు. దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ వుంటారు. భగవంతుడి నామస్మరణ చేయడం వలన, ఆ దేవదేవుడిని సేవించడం వలన మాత్రమే ఆయన ప్రీతి చెందుతాడని కొంతమంది భావిస్తుంటారు. భగవంతుడి సృష్టిలోని మిగతా జీవరాసుల పట్ల దయతో వ్యవహరిస్తే, ఆయన మరింత ప్రీతి చెందుతాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
పశువులు .. పక్షులు .. జలచరాలు .. ఇలా మిగతా జీవుల పట్ల ప్రేమను కలిగి ఉండాలి. వాటిని ఎంత మాత్రం హింసించకుండా ఆహారాన్ని అందించడానికి తమవంతు ప్రయత్నం చేయాలి. అలాగే నిస్సహాయులను ప్రేమతో ఆదరించాలి. వారికి తమ శక్తి మేరకు సహాయ సహకారాలను అందించాలి. స్వార్థాన్ని .. ద్వేషాన్ని పక్కన పెట్టి .. ఇతర జీవులకి సాయపడటంలో ఆనందాన్ని పొందాలి. తన గురించిన భజనలు చేసేటప్పుడు పొందే ఆనందం కన్నా, తన సృష్టిలోని జీవరాశిని ప్రేమిస్తున్నవారిపట్ల భగవంతుడు మరింతగా ప్రీతి చెందుతాడు. అలాంటివారే ఆయనకి అత్యంత ప్రీతి పాత్రులవుతారు.