మహా భక్తుడు హరిదాస్

శ్రీకృష్ణుడి ప్రియ భక్తులలో 'హరిదాస్' ఒకరు. నిరంతరం ఆయన కృష్ణ నామాన్ని జపిస్తూ .. ఆ స్వామి గానం చేస్తూ గడిపేవాడు. 'బృందావనం'లోని ఆయన ఆశ్రమాన్ని కూడా భక్తులు దర్శిస్తూ ఉండేవారు. ఆయన కృష్ణ భక్తిని గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉండేవారు.

ఆ ప్రాంతానికి చెందిన ఒక ధనికుడికి ఇది నచ్చలేదు. దాంతో పదిమందిలో ఆయనని పలచన చేయాలని నిర్ణయించుకుంటాడు. ఒక వేశ్యకి డబ్బు ఎర చూపి, హరిదాసుని వశపరచుకోమని చెప్పి ఓ రాత్రివేళ ఆమెను పంపిస్తాడు. అయితే కృష్ణ నామాన్ని జపిస్తూనే ఆ వేశ్య వంక చూసిన హరిదాస్ కి, ఆమె ఎందుకు వచ్చిందనేది అర్థమవుతుంది.

జపం పూర్తయ్యేవరకూ వేచి ఉండమని చెబుతాడతను. తెల్లవారు జామువరకూ అతను అలా జపం చేస్తూనే వుండటంతో, ఆమె తన ప్రయత్నం ఫలించక వెనుదిరిగి వెళ్లిపోతుంది. అలా రెండు రోజులు జరిగాక, మూడవ రోజున ఆమె ఆశ్రమంలోకి అడుగుపెట్టగానే, ఒక దివ్యజ్యోతి ఆమెలో ప్రవేశిస్తుంది. అంతే ఆ క్షణమే ఆమెలోని చెడు ఆలోచనలు నశిస్తాయి. తనని క్షమించమని హరిదాస్ ను వేడుకున్న ఆమె, ఆ తరువాత నుంచి పవిత్రమైన జీవితాన్ని గడుపుతుంది.


More Bhakti News