భగవంతుడిని అలా ప్రార్ధించాలి

కోరికలు అనంతాలు .. అవి ఒక దాని తరువాత ఒకటిగా పుట్టుకొస్తూనే ఉంటాయి. అలాంటి కోరికలను తీర్చే సాధనమే భగవంతుడని భావించకూడదు. భగవంతుడిని చూడగానే కోరికల చిట్టా విప్పకూడదు. భగవంతుడికి చెప్పుకునే కోరిక ధర్మబద్ధమైనదిగా ఉండాలి. ఆ కోరికలో దురాశ కనిపించనే కూడదు.

అనారోగ్యాల నుంచి గట్టెక్కించమని .. ఆపదల నుంచి కాపాడమని దైవాన్ని కోరుకోవచ్చు. అంతేగాని మేడలు .. కార్లు .. కావాలంటూ, ఎప్పుడూ సుఖాలే వుండాలంటూ భోగమయ జీవితాన్ని ఆయనని కోరకూడదు. పూర్వజన్మ పుణ్య విశేషం కారణంగా అవి ఎవరికి అందవలసినవి వారికి అందుతూనే ఉంటాయి.

అనవసరమైన కోరికల జాబితాను భగవంతుడి ముందుంచి, అవి నెరవేర్చలేదంటూ నిందించ కూడదు. తనని నమ్మినవారి అంకిత భావాన్ని బట్టి, ఎవరికి ఏది ఎంతవరకూ అవసరమో అంతవరకూ ఆయన అనుగ్రహిస్తూనే ఉంటాడు. అందువలన అవసరమైన దానినే అనుగ్రహించమని వేడుకోవాలి. ఈ విషయాన్ని అర్థం చేసుకుని అందినవాటితో సంతృప్తి చెందితే, సంతోషంగా జీవితాన్ని కొనసాగించవచ్చు. ఆశల వెంట పరుగులు తీస్తే ఆనందం ఆవిరైపోతుంది .. మనశ్శాంతి దూరమైపోతుంది అనే విషయాన్ని మరిచిపోకూడదు.


More Bhakti News