ఈ పుష్కరిణిలో స్నానం చేస్తే చాలు!
శ్రీకృష్ణుడు కొలువైన పరమ పవిత్రమైన క్షేత్రాలలో 'గురువాయూర్' ఒకటి. దేవతల గురువైన బృహస్పతి .. వాయుదేవుడు కలిసి ఇక్కడ కృష్ణుడి మూర్తిని ప్రతిష్ఠించడం వలన ఈ క్షేత్రానికి ఈ పేరు వచ్చింది. ఇక్కడి 'రుద్ర తీర్థం' మహిమాన్వితమైనదిగా చెప్పబడుతోంది. ఈ తీర్థంలో స్నానం చేసినవారు వ్యాధుల నుంచి బయటపడతారనడానికి అనేక నిదర్శనాలు వున్నాయి.
తన తండ్రి 'పరీక్షిత్తు' మహారాజు 'తక్షకుడు' అనే పాము కాటు కారణంగా మరణించడంతో, ఆయన కుమారుడైన 'జనమేజయుడు' సర్పజాతి పట్ల ద్వేషంతో 'సర్పయాగం' చేశాడు. అలా అనేక సర్పాలను చంపిన పాప ఫలితంగా ఆయనకి 'కుష్ఠు వ్యాధి' సంక్రమించింది.
ఆ వ్యాధితో బాధపడుతోన్న ఆయనకి పరశురాముడు తారసపడతాడు. 'గురువాయూర్'లోని 'రుద్ర తీర్థం'లో స్నానమాచరించమని చెబుతాడు. దాంతో ఆయన శ్రీకృష్ణుడిని ఆరాధిస్తూ అనునిత్యం ఆ తీర్థంలో స్నానమాచరిస్తూ వస్తాడు. ఫలితంగా కొంతకాలానికి అతని వ్యాధి పూర్తిగా తగ్గిపోతుంది. ఇలా ఈ తీర్థంలో స్నానమాచరించి వివిధ రకాల వ్యాధుల బారి నుంచి బయటపడినవాళ్లు ఎంతోమంది వున్నారని చరిత్ర చెబుతోంది.