ఇక్కడి శిల్పకళ చూసి తీరవలసిందే!

ప్రాచీన క్షేత్రాలను దర్శించినప్పుడు అక్కడి శిల్పకళ అద్భుతమనిపిస్తుంది .. ఆశ్చర్యానందాలను కలిగిస్తుంది. అలా శిల్పకళతో సహా విలసిల్లే క్షేత్రాలలో ఒకటి చిత్తూరు జిల్లా 'సోంపాళ్యం'లో కనిపిస్తుంది. ఇక్కడ ఆవిర్భవించిన చెన్నకేశవస్వామికి విజయనగర రాజులు ఆలయాన్ని నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది.

సువిశాలమైన ప్రదేశంలో ఈ ఆలయం నిర్మించబడింది. పొడవైన ప్రాకారాలు .. మంటపాలు .. స్తంభాలు ఆలయ వైభవానికి అద్దం పడుతుంటాయి. గర్భాలయంలో చెన్నకేశవస్వామి .. ప్రత్యేక మందిరంలో లక్ష్మీదేవి పూజలు అందుకుంటూ వుంటారు. ఈ ఆలయంలో గోడలు .. స్తంభాలు .. మంటపాలు అన్నీకూడా అలనాటి శిల్పకళా వైభవాన్ని ఆవిష్కరిస్తుంటాయి.

పురాణ దృశ్యాలతో పాటు ప్రత్యేక శిల్పాలు ఔరా! అనిపించకమానవు. అమరశిల్పి జక్కన్న .. ఆయన శిష్య బృందం ఈ శిల్పాలను మలిచారని చెబుతారు. అందమైన ఆ శిల్పాలను వాళ్లు మలిచింది రాయితోనా .. మైనంతోనా అనే ఆశ్చర్యం కలిగేంతగా ఆ శిల్పకళ ఉంటుంది. స్వామివారి మహిమలతో పాటు .. అలనాటి శిల్పుల అద్భుతమైన శిల్పకళా చాతుర్యం కారణంగా, ఈ క్షేత్రం మరింత విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది.


More Bhakti News