ఘటి క్షేత్రానికి అందుకే ఆ పేరు!
కుమారస్వామి సర్ప రూపంలో జన్మించాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందువలన ఆయనని సుబ్రహ్మణ్య స్వామిగా భక్తులు పూజిస్తుంటారు. ఈ కారణంగానే ఆయన కొన్ని క్షేత్రాల్లో సర్పరూపంలో పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు. అలా ఆ స్వామి సర్పరూపంలో భక్తులకు దర్శనమిచ్చే క్షేత్రంగా 'ఘటి' కనిపిస్తుంది. కర్ణాటక ప్రాంతంలోని ప్రాచీన క్షేత్రాలలో ఇది ఒకటిగా అలరారుతోంది.
ఈ క్షేత్రం అనేక ఆలయాల సమాహారంగా కనిపిస్తూ ఉంటుంది. పూర్వం 'ఘటికాచలుడు' అనే రాక్షసుడి ఆగడాలు మితిమీరిపోయాయి. దాంతో మహర్షులు .. దేవతలు ఆ రాక్షసుడి ఆగడాలను భరించలేకపోయారు. అతనిని సంహరించగలిగినవాడు సుబ్రహ్మణ్య స్వామి మాత్రమేనని భావించి, ఆయనకి పరిస్థితిని వివరించారు. లోక కల్యాణం కోసం స్వామివారు 'ఘటికా చలుడు'ని సంహరించి, దేవతల కోరికమేరకు ఇక్కడ కొలువుదీరాడు. ఈ కారణంగానే ఈ క్షేత్రానికి 'ఘటి' అనే పేరు వచ్చిందని చెబుతారు.