నెమలి గుండ్ల క్షేత్రం వెనుక కథ!
రంగనాయకస్వామి ఆవిర్భవించిన ప్రాచీన క్షేత్రాలలో 'నెమలి గుండ్ల' ఒకటి. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం పరిధిలో ఈ క్షేత్రం అలరారుతోంది. ప్రకృతి రమణీయత మధ్యలో ఈ క్షేత్రం దర్శనమిస్తుంది. పూర్వం మయూర మహర్షి ఈ ప్రదేశంలో విష్ణుమూర్తిని గురించి కఠోరమైన తపస్సు చేశాడట. ఆయన భక్తికి మెచ్చిన విష్ణుమూర్తి ప్రత్యక్ష దర్శన మిచ్చాడు.
రంగనాయకస్వామిగా ఈ ప్రదేశంలో ఆవిర్భవించి, భక్తులను అనుగ్రహించవలసిందిగా ఆ మహర్షి స్వామిని వేడుకున్నాడట. భక్తుడి కోరికమేరకు స్వామి ఇక్కడ రంగనాయకస్వామిగా ఆవిర్భవించాడు. స్వామిని పూజించడానికి అవసరమైన నీటి కోసం, మయూర మహర్షి 'నెమలి'గా మారిపోయి, ముక్కుతో ఒక గుండాన్ని తవ్వాడు. ఈ గుండలోని నీటితోనే ఆయన స్వామివారికి పూజాభిషేకాలు జరిపినట్టు స్థలపురాణం చెబుతోంది. ఈ కారణంగానే ఈ క్షేత్రాన్ని 'నెమలి గుండం' పేరుతో పిలిచేవారు. కాలక్రమంలో అది 'నెమలి గుండ్ల'గా మారినట్టు తెలుస్తోంది.