కోకిలవాయి క్షేత్రం ప్రత్యేకత
చెన్నకేశవస్వామి ఆవిర్భవించిన ప్రాచీన క్షేత్రాల్లో 'కోకిలవాయి' ఒకటి. ప్రస్తుతం ఇది 'కోగిలవాయి'గా .. 'కోయిలాయి'గా పిలవబడుతోంది. ఇది వరంగల్ జిల్లా పరిధిలో అలరారుతోంది. ఇక్కడ 800 అడుగులు గల ఒక కొండపై చెన్నకేశవ స్వామి ఆవిర్భవించాడు. ఈ కొండ చుట్టూ 10 కిలోమీటర్ల వ్యాసార్థంలో 7 కొండలు ఉండటం విశేషం. ఇక ఈ కొండపైనే కాదు .. చుట్టూ వున్న ఏడు కొండల పైనా కోనేర్లు ఉండటం మరో విశేషం.
సాధారణంగా పుణ్యక్షేత్రాల్లో సహజ సిద్ధంగా ఏర్పడిన కోనేర్లు ఒకటికి మించి ఉండటం చాలా అరుదు. అలాంటిది స్వామివారు కొలువైన క్షేత్రంలోనే కాకుండా చుట్టూ వున్న ఒక్కో కొండపై ఒక్కో కోనేరు ఉండటం ఇక్కడి ప్రత్యేకత. కాకతీయుల కాలంలో వారి సామంత రాజైన 'రేచర్ల రుద్రుడు' ఇక్కడి స్వామివారికి ఆలయాన్ని నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. ఆయన తన సోదరిని ఈ ఊరుకి కోడలిగా పంపించాడట. ఆ బంధుత్వంతో ఈ గ్రామానికి వచ్చిన ఆయన, ఈ క్షేత్ర మహాత్మ్యం గురించి తెలుసుకుని స్వామివారికి ఆలయాన్ని నిర్మించాడని చెబుతారు.