గురువులో వ్యాసుని దర్శించాలి

గురువు అజ్ఞానమనే చీకట్లను పారద్రోలి .. జ్ఞానమనే వెలుగును ప్రసాదిస్తాడు. ఏది సత్యమో .. ఏది నిత్యమో తెలుసుకుని ధర్మబద్ధమైన మార్గంలో నడిపిస్తాడు. ప్రతి ఒక్కరిలోని మానవత్వాన్ని మేల్కొలిపి .. ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆనందాన్ని చాటి చెబుతాడు. సఖ్యత .. సమానత్వంలోని గొప్పతనాన్ని అర్థవంతంగా అందిస్తాడు. జీవితానికి అర్థాన్ని .. పరమార్థాన్ని తెలియజేసే గురువులో వ్యాస మహర్షిని దర్శించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

ముఖ్యంగా 'గురుపౌర్ణమి' రోజున గురువులో వ్యాస మహర్షిని చూసుకోవాలి. ఎందుకంటే ఈ రోజున వ్యాస మహర్షి జన్మదినం .. అందువల్లనే దీనిని 'వ్యాస పూర్ణిమ' అని పిలుస్తారు. వేదాలు .. ఇతిహాసాలు .. పురాణాలు ఆయన ప్రసాదించినవే కనుక, ఈ రోజున ఆయనని ధ్యానించాలి. వేదాలలోని ధర్మా ధర్మాలు సామాన్యులకు సైతం అర్థమయ్యేలా చెప్పడానికి ఆయన తన వంతు కృషి చేశారు. మానవులు ఎలాంటి వాటిని ఆశ్రయించాలి .. ఎలాంటి వాటిని ఆచరించకూడదు అనే విషయాన్ని లోకానికి చాటి చెప్పారు. అందుకే ఈ రోజున ఆయనని సేవించాలి.

ఇక తాము గురువుగా కొలిచే ఆదిశంకరులవారి ఆలయాలను .. దత్తాత్రేయ స్వామివారి ఆలయాలను .. శిరిడీ సాయినాథుడు .. రాఘవేంద్రస్వామి వారి ఆలయాలను ఈ రోజున భక్తులు దర్శించుకుని ధన్యులవుతుంటారు. ఈ రోజున పురాణ పఠనం .. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వలన విశేషమైన పుణ్యఫలితాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.


More Bhakti News