నారదుడిని అనుగ్రహించిన వేంకటేశ్వరుడు
వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన ఒక్కో క్షేత్రానికి ఒక్కో విశేషం ఉంటుంది. అలాంటి విశేషాన్ని కలిగి వున్న క్షేత్రంగా 'బిలకూట' క్షేత్రం దర్శనమిస్తుంది. ప్రసన్న వేంకటేశ్వరుడు కొలువైన ఈ క్షేత్రం నెల్లూరు జిల్లా బోగోలు మండలం పరిథిలో అలరారుతోంది. ఇక్కడి కొండపై గుహలో తపస్సు చేసిన నారద మహర్షికి శ్రీమహావిష్ణువు ప్రత్యక్ష దర్శనమిచ్చి, ఆయనకి శాప విమోచనం కలిగించాడని స్థల పురాణం చెబుతోంది.
దక్ష ప్రజాపతి కారణంగా శాపానికి గురైన నారద మహర్షి భూలోకానికి పరిమితమవుతాడు. తనకి శాపవిమోచనం కలిగే సమయం కోసం ఆయన ఎదురుచూస్తూ, ఇక్కడి గుహలో స్వామి కోసం తపస్సు చేస్తూ గడిపాడట. గజేంద్ర మోక్షం సమయంలో ఏనుగును రక్షించడానికి భూలోకానికి వచ్చిన విష్ణుమూర్తి, ఆ తరువాత ఇక్కడికి వచ్చి నారద మహర్షికి దర్శనమిచ్చి ఆయనని శాపవిముక్తుడిని చేశాడని అంటారు.
ఈ కారణంగానే స్వామి వారి శంఖు చక్రాలు అపసవ్యంగా వుంటాయని చెబుతారు. ఆ స్వామి రూపాన్ని అలాగే అక్కడ ప్రతిష్ఠించి 'ప్రసన్న వేంకటేశ్వరుడు' అనే నామకరణ చేసి నారద మహర్షి పూజించాడు. అందువలన స్వామివారు ఇక్కడ ప్రత్యక్షంగా వున్నాడని భావించి భక్తులు అంకిత భావంతో ఆరాధిస్తూ వుంటారు .. ఆ దేవదేవుడి అనుగ్రహాన్ని పొందుతుంటారు.