అందుకే ఈ క్షేత్రానికి ఈ పేరు

పుణ్యక్షేత్రాలను దర్శించడం వలన ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అంతే కాకుండా ధర్మబద్ధమైన జీవితాన్ని కొనసాగించాలనే ఆలోచన కలుగుతుంది. అలాంటి క్షేత్రాలను దర్శించుకున్నప్పుడు ఆ ప్రాంతానికి ఆ పేరు ఎలా వచ్చిందనే సందేహం కలుగుతూ ఉంటుంది. ఆ క్షేత్రం స్థల పురాణం తెలుసుకుంటే, సందేహానికి సమాధానం దొరుకుతుంది.

నల్గొండ జిల్లా హుజూర్ నగర్ మండలం పరిథిలో 'బూరుగుగడ్డ' అనే క్షేత్రం వెలుగొందుతోంది. వరాహ లక్ష్మీనరసింహ స్వామి - వేణుగోపాల స్వామి ఇక్కడ కొలువై దర్శనమిస్తుంటారు. ప్రాచీనకాలం నాటి ఈ ఆలయాన్ని చూడగానే, ఈ క్షేత్రానికి 'బూరుగుగడ్డ' అనే పేరు ఎందుకు వచ్చిందా అనే సందేహం కలుగుతుంది.

నేటి మిర్యాలగూడెం సమీపంలోని 'వాడపల్లి' క్షేత్రాన్నీ .. నేరేడుచర్ల సమీపంలోని 'సోమలింగేశ్వర స్వామి' క్షేత్రాన్ని 'భృగు మహర్షి' దర్శించుకున్నట్టుగా అక్కడి స్థల పురాణం చెబుతోంది. 'భృగు మహర్షి' నేటి హుజూర్ నగర్ సమీపంలో గల ఈ క్షేత్రాన్ని కూడా దర్శించి, కొంతకాలం పాటు ఇక్కడ తపస్సు చేసుకున్నాడట. అందువలన ఈ ప్రదేశం 'భృగు గడ్డ'గా పిలవబడుతూ, కాలక్రమంలో 'బూరుగు గడ్డ'గా మారిందని చెబుతుంటారు.


More Bhakti News