అదే చెన్నకేశవ స్వామి క్షేత్రం ప్రత్యేకత
గజేంద్ర మోక్షం .. పశ్చిమ గోదావరి జిల్లా 'పట్టిసం'లో జరిగిందని అక్కడి స్థల పురాణం చెబుతూ ఉంటుంది. అందుకు గుర్తుగా అక్కడ గజేంద్ర పర్వతం కనిపిస్తూ ఉంటుంది. శిలారూపంలో వున్న ఏనుగు .. సందేహాలను నివృత్తి చేస్తుంటుంది. అలాంటి గజేంద్ర మోక్షం జరిగినట్టుగా చెప్పబడే చెన్నకేశవస్వామి క్షేత్రం మరొకటి వుంది .. అదే 'కోగిలవాయి'.
వరంగల్ జిల్లా ఆత్మకూర్ మండలంలో ఈ క్షేత్రం అలరారుతోంది. కొండపై ఒక బండరాయి క్రింద చెన్నకేశవస్వామి వెలిశాడు. కాకతీయుల కాలంలో ఈ ఆలయం ఎంతో వైభవంగా వెలిగొందింది. ఇక్కడి కోనేరులో దాహం తీర్చుకోవడానికి ఏనుగు దిగినప్పుడే, మొసలి దాని కాలును పట్టుకుందనీ, ఆ ఏనుగు మొర ఆలకించిన విష్ణుమూర్తి దానిని కాపాడాడు అని చెబుతారు.
అలా ఆ ఏనుగును రక్షించిన స్వామి ఇక్కడి కొండపై వెలిశాడు అని అంటారు. అందుకు సంబంధించిన శాసనం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ కోనేరు మహా లోతైనదని అంటారు. ఇందులోని నీటిని శరీరంపై చల్లుకోవడం వలన చర్మవ్యాధులు నశిస్తాయని చెబుతారు. ఇక్కడి స్వామిని పూజించడం వలన సంతాన లేమి అనేది ఉండదని భక్తులు విశ్వసిస్తుంటారు. గజేంద్ర మోక్షం జరిగిన ప్రదేశంగా వెలుగొందుతూ ఉండటమే ఈ క్షేత్రం ప్రత్యేకత.