మహా శివుడి మహాత్మ్యం
పరమశివుడు కొలువైన ఒక్కో క్షేత్రం ఆయన లీలా విశేషాలకు నిలయంగా వెలుగొందుతూ ఉంటుంది. అలాంటి మహిమాన్వితమైన క్షేత్రాలలో ఒకటిగా 'వాడపల్లి' కనిపిస్తుంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడాకి సమీపంలో శివకేశవ క్షేత్రంగా ఇది విలసిల్లుతోంది. అలాంటి ఈ క్షేత్రంలో .. శివలింగం పైభాగంలో సొట్ట పడినట్టుగా వున్న ప్రదేశం నుంచి నీరు ఊరుతూ ఉంటుంది. ఆ నీరు పొంగిపోయి బయటికి రావడం జరగదు .. అలాగని ఎంతగా తీసినా ఆ నీటి పరిమాణం తగ్గదు.
పరమశివుడు ఒక పావురాన్ని రక్షించడం కోసం, తన తల నుంచి మాంసాన్ని తీసుకోమని ఒక బోయవాడికి చెప్పడం .. అతను అలాగే చేయడం వలన శివలింగంపై ఈ సొట్ట వంటి భాగం ఏర్పడిందని అంటారు. ఈ నీరు ఎంత లోతు నుంచి వస్తుందో తెలుసుకోవడం కోసం, ఆదిశంకరాచార్యులవారు, ఒక ఉద్ధరిణికి దారం కట్టి దానిని ఆ రంద్రం నుంచి లోపలికి వదిలారట.
అలా ఎంతగా దారం వదిలినా వెళుతూనే ఉండటంతో, అది శివుడి లీలా విశేషమేనని ఆయనకి అర్థమై ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఆ దారం వెనక్కి తీయగా దానికి రక్తపు మరకలు అంటడం చూసిన ఆయన, స్వామి అక్కడ ప్రత్యక్షంగా వున్నాడని గ్రహించారు. ఈ వైనమంతా ఇక్కడి శిలాఫలకంపై కనిపిస్తుంది. కృష్ణానదీ తీరంలో కొలువైన ఈ క్షేత్రాన్ని కార్తీక మాసంలో దర్శించుకునే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది.