గజేంద్ర పర్వతం వెనుక కథ!

వీరభద్రస్వామి ఆవిర్భవించిన అత్యంత శక్తిమంతమైన క్షేత్రాలలో .. భావనారాయణ స్వామి వెలసిన పరమ పవిత్రమైన క్షేత్రాలలో 'పట్టిసం' ఒకటిగా కనిపిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో గల ఈ క్షేత్రం శివకేశవులు నడయాడినదిగా .. మహిమాన్వితమైనదిగా చెప్పబడుతోంది. ఈ క్షేత్రంలోనే 'గజేంద్ర పర్వతం' కనిపిస్తుంది.

ఇక్కడి కొండపై ఒక 'శిల' అచ్చం ఏనుగు ఆకారంలో ఉంటుంది. శిలారూపంలో ఏనుగు .. కొండను ఎక్కుతున్నట్టుగా అనిపిస్తుంది. అందువల్లనే 'గజేంద్ర పర్వతం' అనే పేరు వచ్చింది. 'గజేంద్ర మోక్షం' ఈ ప్రదేశంలో జరిగినట్టుగా స్థల పురాణం చెబుతోంది. గజేంద్రుడిని రక్షించడానికి శ్రీమహావిష్ణువు పరుగు పరుగున వచ్చింది ఇక్కడికేనని చెబుతారు. తనని శరణు వేడిన ఏనుగును ఆయన కాపాడిన ప్రదేశం ఇదేనని అంటారు.

ఈ సంఘటనతో అటు ఏనుగుకి .. ఇటు మొసలికి శాప విమోచనం అవుతుంది. అనంతరం వాటి రూపాలు శిలగా మారిపోయాయని అంటారు. అలా శిలగా మారిపోయిన ఏనుగు రూపం మనకి ' గజేంద్ర పర్వతం'పై దర్శనమిస్తుంది. ఇక శిలగా మారిన మొసలి రూపం గోదావరి జలాల్లో కలిసి పోయిందని అంటారు. 'పట్టిసం' క్షేత్రం ప్రతి ఒక్కరూ చూడదగిన క్షేత్రం. గజేంద్ర మోక్షం ఘట్టం చాలామందికి తెలిసి వుంటుంది. అలాంటి ఘట్టానికి నిదర్శనం కనిపిస్తూ ఉంటే పొందే ఆనందం .. అనుభూతి మాటల్లో చెప్పలేనిది.


More Bhakti News