సీతారాముల ఆశీస్సులే చాలు
ధర్మానికి ప్రతీకగా శ్రీరామచంద్రుడు కనిపిస్తే .. ఆదర్శవంతమైన ఇల్లాలుగా సీతమ్మతల్లి కనిపిస్తుంది. భారతదేశంలో ఎక్కడికి వెళ్లినా సీతారాముల కథ వెంట వస్తూనే ఉంటుంది .. వాళ్లు నడయాడిన పుణ్యస్థలాలను చూపిస్తూనే ఉంటుంది. సీతారాములు తమ గుణ విశేషాల చేత ప్రతి ఒక్క హృదయంలో ప్రతిష్ఠించబడిన కారణంగా, ప్రతి గ్రామంలోను సీతారాముల ఆలయాలు దర్శనమిస్తూ ఉంటాయి.
ఇక పట్టణాల్లోను చాలా కాలనీల్లో రాములవారి ఆలయాలు కొలువుదీరి కనిపిస్తూ ఉంటాయి. అలాంటి ఆలయాలలో ఒకటి హైదరాబాద్ - వనస్థలిపురంలోని 'సుభద్రానగర్' కాలనీలో కనిపిస్తుంది. భక్తుల సంకల్పం కారణంగా ఇక్కడ రామాలయం నిర్మించబడింది. కుదురుగా కనిపించే ఈ ఆలయానికి కాలనీవాసులు తప్పకుండా వెళుతుంటారు .. సీతారాముల ఆశీస్సులను కోరుతుంటారు.
ఈ కాలనీలో ఎవరు ఏ శుభకార్యం తలపెట్టినా ముందుగా సీతారాములతో చెప్పుకుని .. వారి పూజ చేయించి ఆరంభిస్తుంటారు. విశేషమైన పర్వదినాల్లో భక్తులంతా తప్పకుండా ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుంటూ వుంటారు .. స్వామివారి సేవలో పాలుపంచుకుంటూ వుంటారు. సీతారాముల ఆరాధన వలన కష్టాలు తొలగిపోయి, సుఖశాంతులతో కూడిన జీవితం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు.