ఆదుకునే హనుమంతుడు
పిలిస్తే పలికే దైవమైన హనుమంతుడిని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తుంటారు .. అంకిత భావంతో సేవిస్తుంటారు. అలాంటి హనుమంతుడు రామాలయాలలోని మందిరాలలోను .. ప్రత్యేక ఆలయాలలోను పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో అరుదుగా పంచముఖ ఆంజనేయస్వామి ఆలయాలు కూడా కనిపిస్తుంటాయి. అలాంటి పంచముఖ హనుమ ఆలయం వనస్థలిపురం - శారదానగర్ లో దర్శనమిస్తుంది.
వనస్థలిపురం .. ఆలయాల సమాహారంలా కనిపిస్తుంది. ఇక్కడి ప్రముఖమైన ఆలయాలలో ఈ పంచముఖ హనుమ ఆలయం ఒకటి. కుదురుగా కనిపించే ఈ ఆలయంలోని హనుమ మూర్తి దివ్యమైన తేజస్సుతో వెలుగొందుతూ ఉంటుంది. స్వామివారికి ఎదురుగా ఆయన వాహనమైన 'ఒంటె' దర్శనమిస్తుంది. ఆలయ ప్రాంగణంలో నవగ్రహా మంటపం .. సుబ్రహ్మణ్యస్వామి .. వినాయకుడు కొలువుదీరి వుంటారు.
ఇక ఇదే ప్రాంగణంలో ధ్యాన మందిరం కూడా ఉంది. ఒక్క మంగళవారమే కాదు .. ప్రతి రోజు స్వామివారిని భక్తులు దర్శించుకుంటూనే వుంటారు. పంచముఖ హనుమంతుడికి ఆకుపూజలు చేయిస్తుంటారు. స్వామివారికి ప్రదక్షిణలు చేయడం వలన .. అభిషేకాలు జరిపించడం వలన ఆపదలు దరిచేరవని భక్తులు విశ్వసిస్తుంటారు. ఎలాంటి కష్టం ఎదురైనా స్వామి ఆదుకుంటాడని అనుభవపూర్వకంగా చెబుతుంటారు.