దుర్గతులను నశింపజేసే దుర్గాదేవి
'అమ్మా' అనే పిలుపుతో తల్లి మనసు ఎంతలా కరిగిపోతుందో .. బిడ్డ అడిగినది ఇవ్వడానికి ఆ చల్లని మనసు ఎంతగా ఆరాటపడుతుందో .. అలాగే తన భక్తుల కోరికలను నెరవేర్చడానికి దుర్గాదేవి ఆతృత పడుతుంది. తన చల్లని చూపులతో బిడ్డల వంటి భక్తులను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. అందుకే అమ్మవారిని అంతా అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తుంటారు.
'దుర్గా' అనే రెండు అక్షరాలను స్మరించడం వల్లనే దుర్గతులు నశిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఏ శుభకార్యాన్ని మొదలుపెడుతూ దుర్గా నామాన్ని స్మరించినా ఆ తల్లి దీవెనలతో .. ఆశీస్సులతో ఆ కార్యం ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుంది. అమ్మవారి మూర్తిని హృదయంలో ముద్రించుకుని .. ఆ తల్లి నామాన్ని స్మరిస్తూ ఉండటం వలన కష్టాలు తీరిపోతాయి.
ఏ కారణంగానైతే దుఃఖం కలుగుతూ ఉందో .. ఆ కారణం కంటికి కనిపించకుండా పోతుంది. అనారోగ్య కారణాల వలన .. ఆర్ధిక పరమైన ఇబ్బందుల వలన .. గ్రహ బాధల వలన .. దుష్ట శక్తుల కారణంగా బాధలుపడేవారిని వాటి నుంచి బయటపడేసే శక్తి దుర్గా నామానికి ఉంది. దుర్గాదేవిని అనునిత్యం పూజిస్తూ .. అంకితభావంతో సేవిస్తూ ఆ తల్లి నామాన్ని నిరంతరం స్మరిస్తూ ఉండటం వలన అన్ని రకాల ఆపదల నుంచి రక్షణ లభిస్తుంది. ఆయురారోగ్యాలు .. ఆనందకరమైన జీవితం లభిస్తుంది. దుర్గానామాన్ని జనిపించే వారిని ఆ నామం ఒక రక్షణ కవచంలా కాపాడుతూ వుంటుందనే విషయాన్ని మరువకూడదు.