అనంతుడిని అనుగ్రహించిన భావనారాయణుడు

శ్రీ భావనారాయణ స్వామి ఆవిర్భవించిన పరమ పవిత్రమైన క్షేత్రాలలో 'సర్పవరం' ఒకటి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకి అతి చేరువలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. విష్ణుమాయ కారణంగా స్త్రీగా మారి .. సంసార దుఖాన్ని అనుభవించిన నారద మహర్షి, ఆ బాధ నుంచి విముక్తిని పొందిన క్షేత్రం ఇది. నారద మహర్షి కోరిక మేరకే భావనారాయణస్వామి ఇక్కడ ఆవిర్భవించాడు.

ఆ తరువాత కాలంలో ఆదిశేషుడి అంశావతారమైన అనంతుడు (సర్పం) స్వామివారిని గురించి తపస్సు చేశాడు. అనంతుడి కఠోర తపస్సుకి మెచ్చిన భావనారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. తనతో పాటు తన సోదరులందరికీ న్యాయం కాని ఒక పనిని తల్లి అప్పగించిందనీ, వ్యతిరేకతని వ్యక్తం చేసిన తమకి త్వరలో నశింపు తప్పదని ఆమె శపించిందని చెబుతాడు. ఈ శాపం బారి నుంచి తమని విముక్తులను చేయమని స్వామిని కోరతాడు.

ఆమె శాప కారణంగా రానున్న విపత్తు నుంచి తాను కాపాడతానంటూ, అనంతుడికి స్వామి వరాన్ని ఇస్తాడు. ఈ క్షేత్రంలో స్వామివారు ఆవిర్భవించిన అనంతరం మొదటిసారిగా వరాన్ని ప్రసాదించినది సర్పానికే కనుక, ఈ క్షేత్రానికి 'సర్పవరం' అనే పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతోంది.


More Bhakti News