నరసింహస్వామి ఆవిర్భవించింది ఇక్కడేనట!

నరసింహస్వామి ఆవిర్భవించిన అత్యంత ప్రాచీనమైన క్షేత్రాలలో 'అహోబిలం' ఒకటి. ప్రహ్లాదుడిని రక్షించడానికి స్థంభం నుంచి వచ్చిన నరసింహస్వామి, హిరణ్య కశిపుడిని సంహరించిన అనంతరం ఆయా క్షేత్రాల్లో కొలువుదీరినట్టుగా కొన్ని క్షేత్రాల్లో స్థల పురాణాలుగా వినిపిస్తుంటాయి. అలా స్వామివారు స్థంభం నుంచి అవతరించిన పుణ్య స్థలమే 'అహోబిలం' అని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

పరమ పవిత్రమైన ఈ క్షేత్రం కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ మండలం పరిధిలో వెలుగొందుతోంది. 108 వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఒకటిగా ఈ క్షేత్రం విలసిల్లుతోంది. చూడగానే ఇది మహిమాన్వితమైన క్షేత్రం అనిపించడం 'అహోబిలం' ప్రత్యేకత. అహోబిలానికి చాలా దగ్గరలో ఒక కొండపై గోడలాంటి ప్రదేశం రెండుగా చీలినట్టుగా కనిపిస్తుంది. నరహింహస్వామి ఆవిర్భావం ఇక్కడ జరిగింది కనుకనే, ఆ చీలిక ఏర్పడిందని చెబుతుంటారు.

దీనినే 'ఉగ్ర స్థంభం' అని పిలుస్తుంటారు. ఇలా యుగయుగాల చరిత్ర కలిగిన ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం .. స్వామి ఆవిర్భవించిన ప్రదేశంలో అడుగుపెట్టడం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. నరసింహస్వామి అనుగ్రహంతో జన్మధన్యమవుతుంది.


More Bhakti News