వీరభద్రుడిని ఆలింగనం చేసుకున్న అగస్త్యుడు
వీరభద్రుడు లింగరూపంలో వెలసిన అరుదైన ప్రాచీన క్షేత్రాల్లో 'పట్టిసాచలం' ఒకటి. తూర్పు గోదావరి జిల్లా .. రాజమండ్రి సమీపంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. కాలక్రమంలో 'పట్టిసం'గా పిలవబడుతోన్న ఈ క్షేత్రం అనేక విశేషాలకు .. మహిమలకు నిలయంగా దర్శనమిస్తూ వుంటుంది.
లింగరూపంలో గల ఇక్కడి వీరభద్రుడు .. వీరేశ్వరస్వామిగా పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. లింగరూపంలో గల స్వామివారిపై 'అగస్త్య మహర్షి' బాహువుల ముద్రలు కనిపిస్తుండటం ఇక్కడి విశేషం. పూర్వం దక్షుడి సంహారం అనంతరం వీరభద్రుడు ఇక్కడి 'దేవకూట పర్వతం'పై తాండవం చేస్తూ వుండగా, అక్కడ గల గుండం నుంచి 'భద్రకాళి' ఆవిర్భవించింది.
వీరభద్రుడి తాండవానికి లోకాలు దడ దడలాడుతూ వుండగా, దేవతలు అగస్త్య మహర్షికి పరిస్థితిని వివరించారు. అప్పుడు అగస్త్య మహర్షి అక్కడికి వచ్చి వీరభద్రుడిని .. భద్రకాళిని శాంతింపజేసి, శాంతించిన వీరభద్రుడిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు. లోక కల్యాణం కోసం భద్రకాళీ సమేతంగా ఇక్కడ కొలువుదీరమని అభ్యర్థించాడు. అలా స్వామివారు .. అమ్మవారు ఇక్కడ ఆవిర్భవించారని స్థల పురాణం చెబుతోంది. వీరభద్రుడిని అగస్త్యుడు ఆలింగనం చేసుకున్నందుకు గుర్తుగా, ఇప్పటికీ వీరేశ్వర స్వామిపై అగస్త్యుడి బాహువుల ముద్రలు కనిపిస్తూ వుంటాయి. భక్తులకు అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంటాయి.