ఆ గజేంద్రుడే ఇంద్రద్యుమ్నుడనే రాజు
గజేంద్ర మోక్షం గురించి తెలియని వాళ్లు వుండరు. నీటి కోసం ఏనుగు సరస్సులోకి దిగగా .. ఓ మొసలి దాని కాలు పట్టుకుంటుంది. గజేంద్రుడు ఎంతగా ప్రయత్నించినా ఆ మొసలి బారి నుంచి బయటపడలేకపోతాడు. శక్తి నశిస్తూ ఉండటంతో .. బాధను తట్టుకోలేక అది రక్షకుడైన దైవానికి తన మొరను తెలియజేస్తుంది. అప్పుడు శ్రీమహా విష్ణువు వచ్చి ఆ మొసలి శిరస్సును ఖండించి గజేంద్రుడిని కాపాడతాడు.
అయితే ఆ గంజేంద్రుడు పూర్వ జన్మలో 'ఇంద్ర ద్యుమ్నుడు' అనే పాండ్య రాజు అని చెప్పబడుతోంది. శ్రీమహా విష్ణువుకి మహా భక్తుడైన ఇంద్రద్యుమ్నుడు .. మౌన వ్రతాన్ని ఆచరిస్తూ తన ఇష్ట దైవాన్ని పూజిస్తుంటాడు. అదే సమయంలో ఆయన ఆశ్రమం దిశగా అగస్త్య మహర్షి వస్తారు. దైవ పూజ చేస్తోన్న సమయంలో ఇతరులకి నమస్కరించ కూడదు కనుక, ఇంద్రద్యుమ్నుడు మౌనంగా తన పూజా కార్యక్రమాన్ని కానిచ్చేస్తుంటాడు.
అది ఆయన అహంకారమని భావించిన అగస్త్యుడు, ఏనుగులా మారిపొమ్మని శపిస్తాడు. అలా ఇంద్రద్యుమ్నుడు భూలోకాన ఏనుగులా జన్మించి అడవులలో సంచరిస్తుంటాడు. హరి భక్తుడు కావడం వలన పూర్వ జన్మ స్మృతి వుంది. అందువల్లనే ఆ ఏనుగు ఆపదలో దైవాన్ని ప్రార్ధించడం .. శ్రీహరి వచ్చి రక్షించడం జరిగాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.