కష్టాలు తీర్చు సాయినాథుడు
శిరిడీ సాయినాథుడు ప్రేమ .. జాలి .. దయ ప్రతి జీవిపట్ల చూపిస్తూ, మనిషన్న ప్రతి ఒక్కరూ మానవత్వాన్ని కలిగి ఉండాలనే సందేశాన్ని ఆచారణ ద్వారా అందించాడు. నిస్వార్థమైన .. నిరాడంబరమైన జీవితాన్ని కొనసాగిస్తూ, తనని నమ్మినవారిని ప్రేమించాడు .. నిస్సహాయులకు సేవలు చేశాడు. ఆపదలో వున్నవారిని ఆదుకుంటూ వచ్చాడు.
అందువల్లనే బాబాను ఎంతోమంది విశ్వసిస్తూ వుంటారు .. అనునిత్యం ఆయనని సేవిస్తుంటారు. అంతగా ప్రభావితం చేశాడు కనుకనే, బాబా ఆలయాలను భక్తులు నిర్మించుకుంటూ వెళుతున్నారు. అలా భక్తుల సంకల్పంతో నిర్మించబడిన ఆలయాలలో ఒకటి, హైదరాబాద్ - పద్మనాభనగర్ లో కనిపిస్తుంది. దాదాపు ఒక పుష్కరకాలం క్రితం ఇక్కడ బాబా ఆలయాన్ని నిర్మించుకున్నారు.
సువిశాలమైన ఈ ఆలయంలో అడుగుపెట్టగానే మానసిక ప్రశాంతత లభిస్తుంది. కరుణ చిందే చూపులతో బాబా అభయాన్ని ఇస్తున్నట్టుగా అనిపిస్తాడు. ఇక్కడ బాబా వారిని వేడుకుంటే కష్టాల నుంచి బయటపడటం జరుగుతుందని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. ప్రతి గురువారంతో పాటు విశేషమైన పర్వదినాల్లో భజనలు .. సేవలు జరుగుతుంటాయి. ఇదే ప్రాంగణంలో వినాయకుడు .. చంద్రమౌళీశ్వర స్వామి .. అభయాంజనేయ స్వామి ఆలయాలు అలరారుతున్నాయి. అందువలన వారంలో ప్రతి రోజు ఈ ఆలయం సందడిగా కనిపిస్తుంది. ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తూ వుంటుంది.