శ్రీరంగనాథుడు అలా వెలుగు చూశాడు
భగవంతుడు కొలువైన ప్రదేశాలకు దాదాపుగా ఆ స్వామికి చెందిన పేర్లే వుంటాయి. ఆ పేర్లతోనే ఆ గ్రామాలు పిలవబడుతూ వుంటాయి. అలా కనిపించే క్షేత్రాలలో 'శ్రీరంగాపురం' ఒకటి. మహబూబ్ నగర్ జిల్లా సమీపంలో గల ఈ క్షేత్రం మహిమాన్వితమైనదని భక్తులు విశ్వసిస్తుంటారు.
శ్రీకృష్ణ దేవరాయలు ఎన్నో ఆలయాలను పునరుద్ధరించారు .. మరెన్నో ఆలయాలను నిర్మించారు. ఆయన ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడి క్షేత్రాలను దర్శిస్తూ వుండేవారు. అలా ఒక సారి శ్రీరంగాన్ని దర్శించిన తరువాత, రంగనాథుడి ఆలయాన్ని నిర్మించాలనే కోరిక ఆయనకి కలిగిందట. ఆ రాత్రే ఆయనకి స్వప్నంలో శ్రీమహా విష్ణువు కనిపించి, రంగనాథుడిగా తాను ఆవిర్భవించిన మూర్తి ఫలానా ప్రదేశంలో ఉందనీ, ఓ గరుడ పక్షి అక్కడికి దారి చూపుతుందని చెప్పాడట. ఆ మూర్తికి ఆలయాన్ని నిర్మించమని సెలవిచ్చాడట.
అలా ఆ మరునాడు ఒక గరుడ పక్షి దారి చూపగా వెళ్లి ఆ మూర్తిని రాయలవారు కనుగొన్నారు. అలా ఆయన ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించారని స్థలపురాణం చెబుతోంది. ప్రాచీన కాలం నాటి ఈ క్షేత్రం భక్తుల కోరికలను నెరవేరుస్తూ, వారి కొంగుబంగారంగా విలసిల్లుతోంది. ఇక్కడ స్వామివారి మూర్తిని చూసితీరవలసిందే. ఒకసారి చూస్తే చాలు ఆ దివ్యమంగళ రూపం మనోఫలకంపై ఎప్పటికీ నిలిచిపోతుంది.