ఆయురారోగ్యాలనిచ్చే సుబ్రహ్మణ్యస్వామి
కష్టాలు తీర్చు స్వామిగా .. కోరిన వరాలను ప్రసాదించు స్వామిగా .. సుబ్రహ్మణ్య స్వామి పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. అలాంటి సుబ్రహ్మణ్యస్వామి ఆవిర్భవించిన ప్రాచీనమైన క్షేత్రాల్లో 'తిరుచ్చెందూరు' ఒకటిగా కనిపిస్తుంది. తమిళనాడు ప్రాంతంలోని ఈ క్షేత్రం అక్కడి మహిమాన్వితమైన క్షేత్రాల్లో ఒకటిగా అలరారుతోంది. సముద్రతీరంలోని ఈ క్షేత్రాన్ని అత్యధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుంటూ వుంటారు.
పూర్వం స్వామివారి భక్తులైన దంపతులు మూగవాడైన తమ కొడుకుని తీసుకుని ఈ క్షేత్రానికి చేరుకున్నారట. తమ కొడుక్కి మాట వచ్చేంత వరకూ ఆ క్షేత్రాన్ని విడిచి వెళ్లేది లేదంటూ, ఆ స్వామి సేవ చేస్తూ అక్కడే వుండిపోయారట. అలా కొంతకాలం గడించిన తరువాత, ఆ స్వామి అనుగ్రహంతో ఆ బాలుడుకి మాట రావడమే కాకుండా, మహా పండితుడు అయ్యాడట.
అందువలన స్వామి ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడని భక్తులు భావిస్తుంటారు. మానసికపరమైన .. శారీరక పరమైన వ్యాధుల నుంచి స్వామి విముక్తిని కల్పిస్తాడని విశ్వసిస్తుంటారు. భక్తులను స్వామి అనుగ్రహిస్తున్నాడనటానికి నిదర్శనంగా, ఇక్కడ మొక్కుబడులు చెల్లించేవారి సంఖ్య కూడా అధికంగా కనిపిస్తుంది. ఇంతటి మహిమాన్వితమైన క్షేత్రాన్ని దర్శించి తరించవలసిందే.