దొంగలను తరిమికొట్టిన అమ్మవారు
ఆయా క్షేత్రాలలో జరిగిన కొన్ని ఆశ్చర్యకర సంఘటనలు అక్కడి దైవం యొక్క మహిమలకి నిదర్శనంగా నిలుస్తుంటాయి. దైవం అక్కడ ప్రత్యక్షంగా ఉందనే సత్యాన్ని లోకానికి చాటుతూ వుంటాయి. అలాంటి మహిమలు జరిగిన క్షేత్రంగా మనకి పశ్చిమ గోదావరి జిల్లాలోని 'శ్రీ రాట్నాలమ్మ' క్షేత్రం దర్శనమిస్తుంది.
కొన్ని రాజ్యాలపై .. గ్రామాలపై దాడులు జరిగినప్పుడు .. అక్కడి గ్రామదేవతలు వాళ్లని తరిమికొట్టి తమని నమ్మిన ప్రజలను కాపాడిన సందర్భాలు ఎన్నో వున్నాయి. అలాంటి క్షేత్రంగా శ్రీ రాట్నాలమ్మ క్షేత్రం దర్శనమిస్తుంది. పూర్వం ఈ ప్రాంతాన్ని పాలించిన వేంగి రాజులు, తమ ప్రజలను .. సంపదలను కాపాడుకోవడానికి గాను 'శ్రీ రాట్నాలమ్మ' తల్లి పాదాలను ఆశ్రయించారు. అనుక్షణం తమని కాపాడవలసిన బాధ్యతను ఆ తల్లికే అప్పగించారు.
అలాంటి పరిస్థితుల్లో, ఆ రాజ్యంలోని సంపదలను అపహరించడానికి కొంతమంది దొంగలు పథకం వేసుకుని రహస్యంగా చొరబడతారు. ఆయితే అర్థరాత్రి వేళ అలా చొరబడిన ఆ దొంగలను రాట్నాలమ్మ అడ్డుకుంటుంది. దొంగలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఆ రాజ్యం నుంచి వాళ్లని తరిమి తరిమి కొడుతుంది. ఈ విషయాన్ని గురించి ఇప్పటికీ అక్కడి ప్రజలు ఆసక్తికరంగా చెప్పుకుంటున్నారు. ఆ తల్లి ఇక్కడ ప్రత్యక్షంగా కొలువై వుందని భావించి అంకిత భావంతో ఆరాధిస్తూ వుంటారు.