పాపాలను తొలగించే వరాహ తీర్థం
శివుడిని ఆరాధించిన భక్తుల పట్ల కేశవుడు ప్రీతిని కలిగి ఉంటాడనీ, కేశవుడిని పూజించిన భక్తులను శివుడు చల్లగా చూస్తాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందువలన శివకేశవ క్షేత్రాలు మరింత మహిమాన్వితమైనవిగా అలరారుతున్నాయి. అలాంటి క్షేత్రాల్లో ఒకటిగా కృష్ణా జిల్లాలోని 'అకిరిపల్లి' కనిపిస్తుంది.
కొండపై ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వామివారి ఆలయం వెలుగొందుతూ వుంటుంది. కొండపైకి చేరుకోగానే మనసుకి ఎంతో ప్రశాంతత లభిస్తుంది. ఇక్కడ శివకేశవులు కొలువు దీరడం వెనుక ఒక కథ వినిపిస్తూ వుంటుంది. పూర్వం ఒక రాజు శివకేశవుల దర్శనం కోసం కఠోర తపస్సు చేశాడట. ఆయన భక్తికి మెచ్చి ప్రత్యక్షమైన శివకేశవులు, ఆయన అభ్యర్ధన మేరకు అక్కడే వెలిశారని చెబుతారు.
ఇక్కడ గల పుష్కరిణి ఎంతో విశేషమైనదని అంటారు. వరాహ రూపంలో శ్రీమహావిష్ణువు ఈ తీర్థాన్ని ఏర్పాటు చేసినట్టు స్థల పురాణం చెబుతోంది. ఈ తీర్థాన్ని తలపై చల్లుకోవడం వలన .. తీర్థంగా స్వీకరించడం వలన పాపాలు నశిస్తాయనీ, ఆయురారోగ్యాలు కలుగుతాయని చెబుతుంటారు. 'అకిరిపల్లి' క్షేత్ర దర్శనం మానసిక ప్రశాంతతతో పాటు, ఆధ్యాత్మిక పరమైన ఆనందానుభూతులను పంచుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.