భక్తుడి కోసం దిగివచ్చిన స్వామి

కలియుగదైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువైన ప్రతి క్షేత్రం మహా విశేషమైనదే .. మహిమాన్వితమైనదే. అలా ఆ స్వామి ఆవిర్భవించిన క్షేత్రాలలో ఒకటిగా ఖమ్మం జిల్లాలోని 'జమలాపురం' కనిపిస్తుంది. భక్తుడి పిలుపు అందుకున్న శ్రీ వేంకటేశ్వరుడు, వైకుంఠం నుంచే దిగివచ్చిన సందర్భాలు ఎన్నో కనిపిస్తాయి.

అలాగే తన దర్శనం కోసం రాలేని నిస్సహాయ భక్తుల కోసం స్వామి ఆయా ప్రదేశాలకి తరలి వచ్చిన సంఘటనలు కనిపిస్తాయి. అలా ఒక భక్తుడి కోసం స్వామి కొండదిగి వచ్చిన సంఘటన మనకి 'జమలాపురం'లో కనిపిస్తుంది. ఇక్కడి పెద్ద కొండపై స్వామి కొలువై పూజాభిషేకాలు అందుకుంటూ ఉండేవాడట.

ఒక భక్తుడు అను నిత్యం ఆ కొండపైకి చేరుకొని ఆయనని సేవించేవాడు. అలాంటిది వయసుడిగిన కారణంగా ఆ భక్తుడు కొండ ఎక్కలేక పోవడంతో, స్వామి కింది కొండమీదుగా దిగివచ్చి దర్శన మిచ్చాడట. అందుకు చిహ్నంగానే చిన్న కొండపై స్వామి పాద ముద్రలు ఏర్పడ్డాయని చెబుతుంటారు. స్వామివారి పాద ముద్రలను దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఆ దివ్యమంగళ స్వరూపుడిని కనులారా దర్శించి తరిస్తుంటారు.


More Bhakti News