సంతానాన్ని అనుగ్రహించే వీరభద్రుడు

వీరభద్రస్వామి ఆవిర్భవించిన క్షేత్రాలు ఎంతో విశిష్టమైనవిగా .. మరెంతో మహిమాన్వితమైనవిగా వెలుగొందుతున్నాయి. అలాంటి క్షేత్రాలలో ఒకటిగా కరీంనగర్ జిల్లాలోని 'కొత్తకొండ' కనిపిస్తుంది. స్వామి ఇష్టపడి మరీ ఈ ప్రదేశంలో ఆవిర్భవించాడని స్థల పురాణం చెబుతోంది. పూర్వం కొంతమంది యువకులు ఎండు కట్టె పుల్లలు సేకరించడానికి ఎడ్ల బండితో ఈ ప్రదేశానికి చేరుకున్నారట.

ఆ చుట్టుపక్కలంతా తిరిగేసి కట్టే పుల్లలు పెద్దమొత్తంలో సంపాదించారు. వాటిని కట్ట కట్టి ఎడ్ల బండ్లు నిలిపిన దగ్గరికి వస్తే, అవి అక్కడ కనిపించలేదు. వాటిని తాము మోయడం సాధ్యం కాకపోవడం .. అప్పటికే చీకటి పడటంతో ఓ చెట్టుకింద నిద్రకి ఉపక్రమించారట. ఆ రాత్రి వారికి కలలో వీరభద్రస్వామి కనిపించి, తాను కొండగుహలో నిక్షిప్తంగా ఉన్నాననీ, తనని కొండ కింద ప్రతిష్ఠింపజేసి ఆలయ నిర్మాణం జరిగేలా చూడమని చెప్పాడట.

ఉదయాన్నే తమ అందరికీ వచ్చిన ఒకే కలను గురించి చెప్పుకుని వాళ్లు ఆశ్చర్యపోయారు. కొండగుహలో స్వామివారి మూర్తి వుండటం చూసి, గ్రామస్తుల సహాయంతో దానిని కిందకి తీసుకువచ్చి ప్రతిష్ఠ కార్యక్రమాలు జరిగేలా చూశారు. అప్పటి నుంచి స్వామికి పూజాభిషేకాలు జరుగుతూ వస్తున్నాయి. ఈ స్వామిని పూజించినవారికి సంతాన భాగ్యం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు. అలా స్వామి అనుగ్రహం చేత సంతానాన్ని పొందిన వాళ్లు మొక్కులు చెల్లిస్తుంటారు.


More Bhakti News