నెట్టికంటి హనుమంతుడి మహిమ
అనంతపురం జిల్లాలో గల ప్రాచీన క్షేత్రాల్లో 'నెట్టికంటి హనుమంతుడు' ఆలయం ఒకటి. ఇక్కడి హనుమంతుడిని తమ ఇలవేల్పుగా భావించి భక్తులు పూజిస్తుంటారు. స్వామి ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడని అనుభవపూర్వకంగా చెబుతుంటారు. అసలు స్వామి ఆవిర్భావమే ఆయన మహిమకు నిదర్శనంగా నిలుస్తుందని అంటారు.
వ్యాసరాయల వారు అనేక ప్రాంతాల్లో హనుమంతుడికి ఆలయాలను నిర్మిస్తూ వెళుతోన్న సమయంలో, ఆయనకి స్వామి కలలో కనిపించి తన మూర్తి జాడ చెప్పాడట. ఫలానా ప్రదేశంలో ఒక ఎండిపోయిన వేపచెట్టు క్రింద తన మూర్తి నిక్షిప్తమై ఉందనీ, అక్కడికి చేరుకోగానే ఆ వేపచెట్టు చిగురిస్తుందని గుర్తులు చెప్పాడట. దాంతో వ్యాసరాయల వారు అలా వెదుకుతూ వెళుతుండగా, ఆ వేప చెట్టు దగ్గరికి రాగానే అది ఒక్కసారిగా పచ్చగా చిగుర్చిందట.
దాంతో ఆయన అక్కడి నుంచి స్వామివారి మూర్తి వెలికి తీయించి ప్రతిష్ఠ చేయించారు. స్వామివారు భక్తులవైపు ఒక కన్నుతో చూస్తూ ఉంటాడు కనుక నెట్టికంటి హనుమంతుడనీ, ఈ క్షేత్రం కసాపురానికి దగ్గరలో వుండటం వలన కసాపురం హనుమంతుడని పిలుస్తుంటారు. అంకితభావంతో ఆ స్వామిని కొలుస్తూ ఆయన అనుగ్రహాన్ని పొందుతుంటారు.