అనుగ్రహించే ఆదివరాహస్వామి
ఆదివరాహస్వామి స్వయంగా ఆవిర్భవించిన క్షేత్రాలు అరుదుగా దర్శనమిస్తూ వుంటాయి. అలాంటి అరుదైన క్షేత్రాలలో ఒకటి, కరీంనగర్ జిల్లా కమాన్ పూర్ లో కనిపిస్తుంది. ఇక్కడ స్వామి విగ్రహ రూపంగా కాకుండా, పెద్ద బండరాయిపై వెలసి దర్శనమిస్తూ ఉంటాడు.
ఓ మహర్షి కోరిక మేరకు స్వామి ఆయనకి ప్రత్యక్ష దర్శన మిచ్చాడనీ, ఆయన అభ్యర్థన మేరకు ఇక్కడే బండరాయిపై వెలిశాడని చెబుతుంటారు. ఈ బండరాయిపై స్వామివారి ఆకారం పెరుగుతూ వుండటం విశేషం. చాలా కాలం క్రితం వున్న ఆకారానికంటే .. ఇప్పుడున్న ఆకారం పెద్దదిగా కనిపిస్తుందని చెబుతారు. స్వామి పరిమాణం పెరుగుతోందనే విషయాన్ని స్పష్టంగా గమనించవచ్చని అంటారు.
అంతేకాదు స్వామి ఇక్కడ ఆది వరాహ రూపంలో తిరుగాడాడు అనడానికి నిదర్శనంగా అక్కడి రాళ్లపై గల పాద ముద్రలను చూపిస్తారు. స్వామిని అంకిత భావంతో ఆరాధించడం వలన కోరిన కోరికలు నెరవేరతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. అందువల్లనే వరాహ స్వామిని వరాల స్వామిగా పిలుచుకుంటూ, కానుకలు .. మొక్కుబడులు చెల్లించుకుంటూ వుంటారు.