భగవంతుడు అలా సంతోషిస్తాడు
తన పట్ల విశ్వాసం .. ఇతరుల పట్ల ప్రేమ .. జీవుల పట్ల దయ కలిగినవారి విషయంలో భగవంతుడు సంతోషిస్తాడు. అలాంటి వారిపట్ల ప్రీతిని చెంది అనుగ్రహిస్తాడు. భగవంతుడిని ఆరాధించేవారు సహజంగానే తమ తోటివారిని ప్రేమిస్తుంటారు. మూగజీవుల పట్ల దయను కలిగి వుంటారు. ఉన్నదాంట్లో సంతృప్తి చెందుతూ .. దానధర్మాలు చేస్తుంటారు.
ఇతరులకి సాయం చేసే పరిస్థితుల్లో తాము లేమని తెలిసి కూడా, భగవంతుడిపై భారం వేసి చివరివరకూ ప్రయత్నం చేస్తారు. కష్టాలు ఎదురైతే వాటిని ఎదుర్కునే శక్తిని ప్రసాదించే వాడు భగవంతుడేనని నమ్ముతారు. కారు మబ్బుల్లా అవి తొలగిపోతే, అందుకు కారకుడు ఆయనేనని కృతజ్ఞతలు చెప్పుకుంటారు. తాము నిమిత్తమాత్రులమని తలుస్తూ .. తమతో ఈ సేవా కార్యక్రమాలను చేయిస్తున్నది ఆ పరమాత్ముడేనని భావిస్తుంటారు.
అసలైన ఆనందం దైవాన్ని కీర్తించడంలోనే ఉంటుందని భావించి, ఆయనని కీర్తిస్తూ అనంతమైన ఆనందాన్ని పొందుతుంటారు. మహా భక్తుల జీవిత చరిత్రలను పరిశీలిస్తే .. భగవంతుడి పట్ల వారికి గల విశ్వాసం ఏ స్థాయిలో ఉందో తెలిపే ఎన్నో నిదర్శనాలు కనిపిస్తాయి. దీనుల పట్ల .. మూగజీవాల పట్ల వారు చూపించిన ప్రేమ ఎంతటిదో అర్థమవుతుంది. మానవత్వాన్ని చూపడమే భగవంతుడికి సంతోషాన్ని కలిగిస్తుందనీ, అదే ఆయనకి చేరువను చేస్తుందనే విషయం స్పష్టమవుతుంది.