వైశాఖ మాసంలో మజ్జిగ దానం!
శ్రీమహా విష్ణువు ఆరాధన వలన .. దాన ధర్మాల వలన విశేషమైన ఫలితాలను అందించే మాసాల్లో వైశాఖ మాసం మరింత ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది. ఈ మాసంలో చేసే దానం అనేక రెట్ల ఫలితాన్ని ఇస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. సాధారణంగా ఈ మాసంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది కనుక గొడుగులు .. పాదరక్షలు .. మంచి నీళ్లు .. మజ్జిగ దానంగా ఇస్తుంటారు.
ఎండలో ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటే పాదరక్షలు .. గొడుగు తప్పనిసరి అవుతాయి. అందువలన వాటిని దానంగా ఇస్తుంటారు. ఇక దాహం తీర్చుకోకుండా ఎవరూ కూడా ఎక్కువ సేపు ఉండలేరు. అలాంటివారి దాహార్తిని తీర్చడం కోసం కొంతమంది చలివేంద్రాలు ఏర్పాటు చేస్తుంటారు. ఇలా దాహంతో ఉన్నవారికి స్వచ్ఛమైన చల్లని మంచి నీటిని అందించడం వలన, ఆ తరువాత ఏ జన్మను ఎత్తినా మంచి నీటి కోసం తపించే అవసరం రాకుండా ఉంటుందట.
ఇక మరి కొంతమంది ఈ మాసంలో 'మజ్జిగ' దానం చేస్తుంటారు. ఎండలో ప్రయాణం చేస్తున్నవారికి, మజ్జిగ దానంగా ఇవ్వడం వలన వాళ్లని ఎండదెబ్బ నుంచి కాపాడినట్టే అవుతుంది. మజ్జిగ ఇవ్వడం ఎంతో పుణ్యం కనుకనే, పూర్వకాలంలో ఎవరైనా అతిథులు రాగానే వాళ్లకి మజ్జిగను ఇచ్చేవారు. మజ్జిగను దానంగా ఇవ్వడం వలన జీవితం సుఖసంతోషాలతో కొనసాగుతుందనీ, సిరిసంపదలు చేకూరతాయని అంటారు. అందువలన వైశాఖ మాసంలో మంచి నీళ్లను .. మజ్జిగను దానంగా ఇచ్చే అవకాశాన్ని వదులుకోకూడదు.