ఆదుకునే ఆంజనేయుడు

బలాన్నీ .. బుద్ధినీ .. ధైర్యాన్నీ .. కీర్తిని ప్రసాదించే స్వామి హనుమంతుడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. స్వామి అనేక క్షేత్రాలలో కొలువుదీరి .. అనునిత్యం పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. అలాంటి ఆలయాలలో ఒకటి సికింద్రాబాద్ - మల్కాజ్ గిరిలోని మారుతి నగర్లో దర్శనమిస్తుంది. ఈ స్వామి కారణంగానే ఈ కాలనీకి ఈ పేరు వచ్చింది.

ఇక్కడ స్వామికి నాలుగు వందల సంవత్సరాలకి పైగా చరిత్ర ఉందని చెబుతారు. స్వామి ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడనీ .. అందుకు ఆయన పాద ముద్రలే నిదర్శనమని అంటారు. శివాంశ సంభూతుడుగా చెప్పబడుతోన్న హనుమంతుడు, శివాలయం ప్రాంగణంలోనే కొలువుదీరి ఉండటం ఇక్కడి విశేషం. ప్రతి మంగళవారం స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది.

స్వామిని అంకితభావంతో పూజించడం వలన కష్టాలు .. నష్టాలు తొలగిపోతాయని భక్తులు భావిస్తుంటారు. అనారోగ్యాలు .. ఆర్ధికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడటం జరుగుతుందని అంటారు. మానసిక పరమైన చీకాకుల నుంచి దూరమై .. ప్రశాంతతను పొందడం జరుగుతుందని అనుభవపూర్వకంగా చెబుతుంటారు. తమ తమ పనులకు బయలుదేరుతూ ఈ స్వామిని దర్శించుకుని వెళ్లడం వలన, కార్యసిద్ధి కలుగుతుందని వాళ్లు విశ్వసిస్తుంటారు. ఇలా ప్రాచీనతను .. స్వామివారి మహిమలను చాటుతూ వెలుగొందుతోన్న ఈ ఆలయాన్ని దర్శించడం అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తుందని చెప్పొచ్చు.


More Bhakti News