వైశాఖ మాసంలో మామిడి పండ్ల దానం
అత్యంత పుణ్యప్రదమైన మాసాలలో 'వైశాఖ మాసం' ఒకటి. ఈ మాసంలో చేసే ఒక్కో దానం ఒక్కో విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందువల్లనే ఈ మాసంలో అన్నదానం .. వస్త్రదానం .. గొడుగు - పాదరక్షలు .. మంచినీళ్లు దానం చేస్తుంటారు. ఇక ఈ కాలంలో కాసే మామిడి పండ్లను కూడా దానం చేస్తుంటారు.
మొదటిసారిగా మామిడి పండ్లను ఎవరికైనా దానం చేసిన తరువాతనే వాటిని రుచి చూడటం చేస్తుంటారు. కొంతమంది ముందుగా మామిడి పండ్లను ఆలయంలో సమర్పించి .. బ్రాహ్మణులకు దానం చేసి ఆ తరువాతనే తాము తీసుకుంటారు. ఈ విధంగా వైశాఖ మాసంలో మామిడి పండ్లను దానం చేయడం వలన, పూర్వీకులకు పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని చెబుతారు. అంతేకాదు ఇలా మామిడి పండ్లను దానం చేసినవారికి ఆ పుణ్యఫల విశేషం కారణంగా ఉత్తమ గతులు కలుగుతాయని అంటారు. అందువలన ఈ మాసంలో మామిడి పండ్లను దానం చేయడం మరిచిపోకూడదు.